1.34 లక్షల తెల్ల కార్డులు ఉఫ్

జిల్లాకు చేరుకున్న అనర్హుల జాబితా


● ప్రభుత్వానికి ఏటా రూ.84.60కోట్ల మిగులు'

తెల్లకార్డుదారుల్లో అనర్హుల ఏరివేతకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి సేకరించిన వివరాల ఆధారంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న 12,45,330 కార్డుల్లో 1,34,396 మంది అనర్హులున్నట్లు ప్రభుత్వం తేల్చింది. అనర్హుల జాబితాలు గ్రామ సచివాలయాల వారీ జిల్లాకు శనివారం ఉదయం చేరుకున్నాయి. వాటిని మరోసారి పరిశీలించే బాధ్యతను వీఆర్వోలకు అప్పగించారు.

గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో పౌరసరఫరాల శాఖ ఉప తహసీల్దార్లు, నగర పరిధిలో సహాయ సరఫరా అధికారులు ఆయా పరిశీలనను పర్యవేక్షిస్తున్నారు
అనర్హులను తొలగించగా మిగతా 11,10,934 మందికి బియ్యం కార్డులు జారీ చేయనున్నారు. వీరికి మాత్రమే మార్చి నుంచి రాయితీ బియ్యం అందుతుంది. అనర్హుల వివరాలను మరోసారి పరిశీలన చేస్తున్నా.. ఇప్పటికప్పుడు తుది నిర్ణయానికి వచ్చే అవకాశం లేదు.
నాలుగు అంశాల ఆధారంగా ఏరివేత: వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు తెల్లకార్డుల స్థానంలో బియ్యం కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. నవశకం సర్వేలో భాగంగా తెల్లకార్డుదారుల వివరాలను గ్రామ వాలంటీర్ల ఆధ్వర్యంలో ఆరా తీయించారు. దీనికి నాలుగు అంశాలను కొలమానాలుగా నిర్ణయించారు.
●ఆదాయ పన్ను చెల్లింపు, నాలుగు చక్రాల వాహనం (సొంతంగా కారు కలిగి ఉన్నవారు), గ్రామీణంలో 3 ఎకరాల పైబడి భూములున్నవారు, నెలకు 300 యూనిట్లకు పైగా విద్యుత్తు వినియోగిస్తున్న వారిని అనర్హులుగా పరిగణించాలని ఆదేశాలు జారీ చేశారు.
నగర పరిధిలో తూతూమంత్రంగా సర్వే : విశాఖ నగర పరిధిలో ఈ సర్వే పక్కాగా సాగలేదు. కొంత మంది ఇళ్లకు వాలంటీర్లు అసలు వెళ్లలేదనే ఆరోపణలున్నాయి. అధికార పార్టీకి చెందిన వార్డు స్థాయి నేతల కనుసన్నల్లో వాలంటీర్లు నివేదికలు తయారు చేశారనే ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. వాలంటీర్లు ఇచ్చిన నివేదిక ఆధారంగా జిల్లాలో 1,34,396 మందిని అనర్హులుగా తేల్చారు. వీరి వివరాలను శనివారం నుంచి పునఃపరిశీలన చేపట్టినా అవన్నీ కంటి తుడుపు చర్యలగానే చెబుతున్నారు.

నగర పరిధిలో 70వేల కార్డులు ఉఫ్‌..

జిల్లాలో మొత్తం 12,45,330 తెలుపు కార్డులున్నాయి. వీటిలో 4.19 లక్షల కార్డులు నగరంలో ఉండగా, మిగతావి గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఉన్నాయి. నగర పరిధిలో 70వేల మంది వరకు అనర్హులు ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు. అర్హులు, అనర్హుల జాబితాలేవీ పౌరసరఫరాల శాఖకు రాలేదు. నేరుగా గ్రామ సచివాలయ కంప్యూటర్‌ లాగిన్లకు వెళ్లాయి. అక్కడి ఉద్యోగులు ఆయా వివరాలను తెలుసుకొని విచారణ చేపడుతున్నారు. మళ్లీ అక్కడే విచారణాంశాలను నమోదు చేయాలి.
ఉదాహరణకు నలుగురు కుటుంబ సభ్యులున్న ఇంట్లో.. ఏ ఒక్కరు ఆదాయ పన్ను చెల్లించినా ఆ కార్డును అనర్హుల జాబితాలో ఉంచారు. కుమారుడు ఉద్యోగం చేసి ఆదాయ పన్ను కట్టినా ఇబ్బందే. అలాంటి వారి వివరాలను కార్డు నుంచి మినహాయించుకుంటే మళ్లీ బియ్యం కార్డు పొందేందుకు అర్హులుగా పరిగణిస్తారు.


నెలకు 7.05కోట్ల మేర ఆదా..

కుటుంబంలో ఒక్కో సభ్యునికి నెలకు కిలో రూ.1 చొప్పున అయిదు కిలోల బియ్యం ఇస్తున్నారు. గరిష్ఠంగా నెలకు ఒక్కో కుటుంబానికి 20కిలోల వరకు వస్తాయి.
జిల్లాలో తొలగించిన 1,34,396 కార్డులకు సంబంధించి ఒక్కో కార్డుకు ముగ్గురు చొప్పున లెక్క వేసుకుంటే నెలకు 2,015 టన్నుల మేర బియ్యం ఆదా కానున్నాయి.
టన్ను బియ్యాన్ని ప్రభుత్వం రూ.35వేలు చెల్లించి కొనుగోలు చేస్తోంది. ఈ లెక్కన నెలకు రూ.7.05కోట్ల మేర ప్రభుత్వానికి రాయితీ భారం తగ్గనుంది. ఏడాదికి రూ.84.60 కోట్ల మేర ఆదా కానుంది.

Post a Comment

0 Comments