మోడీ స్కూటీ యోజన నిజం కాదు, ఫేక్... నమ్మితే మోసపోతారు...!!
🎁 పదో తరగతి పాస్ అయిన బాలికలకు ఫ్రీ స్కూటీ, సరికొత్త పథకం 🎁
💐 మహిళల సంక్షేమం కోసం ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. మరొక అడుగు ముందుకు వేసి అర్హత కలిగిన బాలికలకు స్కూటీలు ఇవ్వాలనే లక్ష్యంతో స్కూటీ యోజన ప్రవేశపెట్టారు. పదో తరగతి తర్వాత బాలికలు ఉన్నత విద్యను అభ్యసించాలని, ఎలాగైనా పై చదువులు చదవడం, ఆ తర్వాత చిన్నపాటి ఉద్యోగాలు చేసేందుకు వెళ్లి రావడానికి ఇబ్బందులు పడుతున్నారు.
ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి మోడీ స్కూటీ యోజన పథకాన్ని ఈ ఏడాది మే నెలలో శ్రీకారం చుట్టారు. ఈ పథకంలో బాలికలు, మహిళలకు స్కూటీలు ఉచితంగా ఇవ్వనున్నారు. సర్కార్ యోజన వెబ్సైట్లోకి వెళ్లి స్కూటీ యోజనకు సంబంధించిన దరఖాస్తు నింపాలి. పదో తరగతి మార్కుల జాబితా, రేషన్ కార్డు, ఆధార్, ఆధాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు LLR / లైసెన్స్ కూడా ఆన్లైన్లో దరఖాస్తుతో నమోదు చేయాలి.
అందుకు సంబంధంచి ధ్రువీకరణ పత్రాలు కూడా జత చేయాలి. ఈ నెల 30వ తేదీతో తరఖాస్తుల స్వీకరణ గడువు ముగియనుంది. అర్హత ఉన్న వారికే స్కూటీ ఇస్తారు. ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే అవకాశం కల్పిస్తారు. పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాల్సి ఉంది. 18 నుంచి 40 సంవత్సరాల లోపు ఉండాలి. ఆదాయం రూ. 2.50 లక్షల లోపు ఉండాలి. ఆధార్, రేషన్ కార్డు, మార్కుల జాబితాలో ఒకే పేరు ఒకేలా ఉండాలి. ఏదైనా తేడా ఉంటే దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది 💐
చదివారు కదా..! ఇదీ కొద్దిరోజులుగా వాట్సపు గ్రూపుల్లో, ఫేస్ బుక్ పేజీల్లో, వాల్స్ పైన బాగా స్ప్రెడ్ అవుతున్న పోస్టు. గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా కొందరు స్వయంగా ఆన్ లైన్ అప్లికేషన్ అంటూ డబ్బులు వసూలు చేస్తున్నారు. అప్లికేషన్ ఫామ్స్ క్రియేట్ చేసి, అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. పట్టణాల్లోనూ మోసపోయేవాళ్లు తక్కువేమీ కాదు,ముందుగా ఈ పోస్టుల్ని షేర్ చేసేవాళ్లు, అప్లయ్ చేసేవాళ్లు, చేయించేవాళ్లు, చేయాలనుకునేవాళ్లు ఓ సంగతి చదవాలి,ముందుగా ఈ ఫోటో చూడండి
గత సంవత్సరం మోడీ ఈ స్కీం ఆ స్కీం లాంచింగు నాటి ఫోటో ఇది, ఈ పక్కన ఉన్నది తమిళనాడు సీఎం పళనిస్వామి. అయితే గమనించాల్సిన విషయం, నిజం ఏమిటంటే..? అది తమిళనాడు రాష్ట్రంలో స్కీం, స్కూటీలకు 50 శాతం సబ్సిడీ ఇచ్చే పథకం. గతంలో జయలలిత ఈ హామీ ఇచ్చారు. కనుక, ఆమె మరణించాక, ఆమె స్మారకార్థం, ఆమె గౌరవార్థం, ఆమె 70వ జయంతి సందర్భంగా ఈ స్కీంను అక్కడి ప్రభుత్వం స్టార్ట్ చేసింది. అదీ అసలు సంగతి. ఆ స్కీం పేరు ప్రధానమంత్రి మోడీ స్కూటీ యోజన కాదు. అది ‘అమ్మ టూ-వీలర్ స్కీం’ రెండున్నర లక్షలలోపు ఆదాయమున్న వితంతువులు, దివ్యాంగులు, వర్కింగ్ వుమెన్కు ఉద్దేశించిన పథకం. అంతేతప్ప బాలికలకు, విద్యార్థినులకు ఉద్దేశించిన పథకం కాదు. మరొకటి కూడా ఇలాంటిదే రాజస్థాన్ ప్రభుత్వం కూడా ఓ స్కీం గత ఎన్నికలకు కాస్త ముందుగా ప్రవేశపెట్టింది, ఇదోసారి చూడండి
మేధావి ఛాత్రా స్కూటీ యోజన, అనగా మెరిట్ఉన్న విద్యార్థినులకు సబ్సిడీతో స్కూటీలు సప్లయ్ చేసే స్కీం. అదీ కేవలం రాజస్థానీ విద్యార్థినులకు మాత్రమే,
అంతే తప్ప మోడీ పేరిట, కేంద్ర ప్రభుత్వం ఇలాంటి స్కీం ఏదీ రన్ చేయడం లేదు.
ఐనా సరే, ఫేక్ యూట్యూబు వీడియోలు చూస్తూ, ఫేక్ వార్తల్ని చదువుతూ, ఫేక్ సోషల్ పోస్టులు నమ్ముతూ, డబ్బులు ఖర్చు చేసి, దరఖాస్తు చేయాలనుకుంటే ఇక మీ ఇష్టం..


0 Comments