AP Dsc 2024: 16,374 పోస్టులతో మెగా డీఎస్సీ-చంద్రబాబు తొలిసంతకం-కేటగిరీల వారీగా ఇవే..!

 ఏపీలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఇవాళ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం రాష్ట్రంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు వీలుగా రూపొందించిన ఫైలుపై సీఎంగా తన తొలి సంతకం చేశారు. మొత్తం 16374 పోస్టులతో రాష్ట్రంలో మెగా డీఎస్సీ నిర్వహణకు దీంతో లైన్ క్లియర్ అయినట్లయింది. గతంలో వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ను రద్దు చేసి దాని స్ధానంలో 16374 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ విడుదల కానుంది.

గతంలో వైసీపీ ప్రభుత్వం 6100 పోస్టులతో ఎన్నికలకు ముందు నోటిఫికేషన్ విడుదల చేసింది. డీఎస్సీ పరీక్షకు ముందే హడావిడిగా టెట్ పరీక్ష నిర్వహించింది. టెట్ ఫలితాలకూ, డీఎస్సీ పరీక్షకూ మధ్య తగినంత వ్యవధి లేకపోవడంతో అభ్యర్ధులు హైకోర్టును ఆశ్రయించడంతో ఇది కాస్తా వాయిదా పడింది. అనంతరం ఎన్నికల కోడ్ కారణంగా నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం జరగడంతో డీఎస్సీ కాస్తా అటకెక్కింది. ఇప్పుడు కూటమి ప్రభుతత్వం దాదాపు 10 వేలకు పైగా అదనపు పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహణకు సిద్దమవుతోంది.



        ఈ 16374 పోస్టుల్లో కేటగిరీల వారీగా ఏయే పోస్టులు ఉన్నాయో ఇవాళ ప్రభుత్వం వివరాలు విడుదల చేసింది. దీని ప్రకారం అత్యధికంగా 7725 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 6371 ఎస్జీటీలు, 286 భాష పండిట్లు, 132 పీఈటీలు, 52 ప్రిన్సిపాల్ పోస్టులు ఉన్నాయి. ఈ మేరకు పాత నోటిఫికేషన్ రద్దు చేసి విద్యాశాఖ త్వరలో తాజా నోటిఫికేషన్ ఇవ్వబోతోంది. అలాగే మెగా డీఎస్సీ ఎప్పుడు ఉంటుంది, ఇతర వివరాలను కూడా విడుదల చేయనుంది. ఆ మేరకు త్వరలో పరీక్షలు నిర్వహిస్తారు.

Post a Comment

0 Comments